సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 12:11 PM IST

National News, Delhi, Supreme Court, CJI, Justice Suryakant, Supreme Court of India, Justice Gavai

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు. జస్టిస్ BR గవాయ్ పదవీకాలం నవంబర్ 23తో ముగియనుంది. దీంతో దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి మార్గం సుగమమైంది.

జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సూచించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కోరిన మీదట జస్టిస్ గవాయ్ ఈ సిఫారసు చేశారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్.. నవంబర్ 24న నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేసేంత వరకు, అంటే సుమారు 14 నెలల పాటు ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు.

కాగా, 2025 మే నెలలో జస్టిస్ గవాయ్ 52వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం, సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందు న్యాయ మంత్రిత్వ శాఖ తదుపరి వారసుడి పేరును సిఫారసు చేయాలని కోరుతుంది. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ) ప్రకారం, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సీజేఐగా నియమిస్తారు.

జస్టిస్ సూర్య కాంత్ ఎవరు?

జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్‌లోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ నుంచి 1981లో డిగ్రీ, రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీసును ప్రారంభించారు. 1985లో చండీగఢ్‌కు మారి పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 జులై 7న హర్యానా రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అడ్వొకేట్ జనరల్‌గా రికార్డు సృష్టించారు.

Next Story