గ్యాంగ్ రేప్ జ‌ర‌గ‌లేదు.. అత్యాచారం చేసి.. హత్య చేసింది అత‌డే.. ఆర్‌జి కర్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదు.

By Medi Samrat  Published on  7 Oct 2024 11:57 AM GMT
గ్యాంగ్ రేప్ జ‌ర‌గ‌లేదు.. అత్యాచారం చేసి.. హత్య చేసింది అత‌డే.. ఆర్‌జి కర్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీబీఐ ఈరోజు సీల్దా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుడు సంజయ్‌రాయ్‌ను ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ప్ర‌కారం.. నిందితుడు సంజయ్ రాయ్ స్థానిక పోలీసుల వద్ద పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆగస్టు 9న బాధితురాలు ఆసుపత్రిలోని సెమినార్ గదిలో నిద్రించడానికి వెళ్లిన సమయంలో నిందితుడు నేరానికి పాల్పడ్డాడని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

సామూహిక అత్యాచారం ఆరోపణ గురించి సీబీఐ ఛార్జిషీట్‌లో ప్రస్తావించలేదు. సంజయ్ రాయ్ ఒంటరిగా నేరం చేశాడని సూచిస్తుంది. ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో మహిళా డాక్ట‌ర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన‌ట్లు పేర్కొంది. ఆసుపత్రిలో షిఫ్ట్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి అర్ధరాత్రి తర్వాత ఆమె గదికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం ఒక జూనియర్ డాక్టర్ ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్ల‌డించింది. సీసీటీవీ ఫుటేజీలో ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ సెమినార్ గదిలోకి వెళ్లడం కనిపించింది. దాదాపు అరగంట తర్వాత గదిలోంచి బయటకు వచ్చాడు.

ఘటనా స్థలంలో నిందితుడి బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను కోల్‌కతా పోలీసులు గుర్తించారు. CBI కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత రాయ్‌కు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వ‌హించారు. అక్కడ అతడు తాను నిర్దోషి అని పేర్కొన్నాడు. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లే సరికి ఆ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా.. గాయపడిన స్థితిలో ఉన్న మహిళను చూసి భయపడ్డానని చెప్పాడు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు నిందితుడు ప్రయత్నించాడ‌ని సీబీఐ పేర్కొంది.

Next Story