భర్తతో గొడవ పడిన ఓ మహిళ తన కుమారుడి తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి రవాణా అందుబాటులో లేకపోవడంతో కాలినడక తన సోదరి ఇంటికి బయలు దేరింది. అలా దాదాపు 100 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లింది. ఈలోగా పోలీసులు ఆమెను నిలువరించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో వెలుగుచూసింది.
శివమొగ్గ జిల్లా గాడికొప్పకు చెందిన నాగరత్న ఏదో విషయంలో భర్తతో గొడవ పడింది. భర్తతో ఉండడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా తన కుమారుడిని తీసుకుని విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తుంబిగెరెలోని సోదరి నివాసానికి వెళ్లేందుకు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరింది. లాక్‌డౌన్ కావడంతో బస్సులు లేవు. పైగా చేతిలో డబ్బులు కూడా కరువు. దీంతో ఆమె నడకనే నమ్ముకుంది. రాత్రి వేళకు ఆమె దావణగెరెకు చేరుకుంది. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెలుతున్న ఆమెను పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రశ్నించగా.. భర్తతో కొట్లాడి కొడుకును భుజాలపై మోసు కుంటూ అక్క ఇంటికి కాలినడకన వెళ్తున్నట్లు వారికి వివరించింది. ఇలా ఆమె 90 కిలోమీటర్లు నడిచినట్లు తెలిసి పోలీసులే విస్తుపోయారు. పోలీసులు ఆమెకు విశ్రాంతి కల్పించి భోజనం పెట్టారు. అనంతరం వాహనాన్ని సమకూర్చి సోదరి ఇంటికి పంపించారు.