జీ20 సమ్మిట్‌కు వస్తోన్న దేశాధినేతలు..కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు
భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు జరగనుంది. దేశాధినేతలు భారత్‌కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిం
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 7:27 AM ISTజీ20 సమ్మిట్‌కు వస్తోన్న దేశాధినేతలు..కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా జీ20 సదస్సు జరగనుంది. పలు దేశాధినేతలు భారత్‌కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వారి బస కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా జీ20 దేశాధినేతలు, ప్రతినిధుల కోసం ఢిల్లీలోని అత్యంత ఖరీదైన హోటళ్లను సిద్ధం చేశారు. ఆయా హోటళ్ల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. బ్రిటన్ ప్రధాని సునాక్ మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమానం మధ్యా హ్నం 2.15 గంటలకు ల్యాండ్ కానుంది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఇక మిగిలిన నేతలు కూడా మధ్యాహ్నం, రాత్రి వరకు భారత్‌కు చేరుకుంటారు.
ఐటీసీ మౌర్యలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వసతి కల్పించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు శాంగ్రీలా హోటల్‌లో వసతి కల్పించారు. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ద లలిత్ హోటల్‌లో బస చేస్తారు. జపాన్ ప్రధాని పుమియో కిషిదా ఇక్కడే ఉంటారని సమాచారం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఇంపీరియల్ హోటల్‌లో బస చేస్తారు. దిల్లీలోని మరో ప్రముఖ హోటల్ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్ ఉంటారు. ఒబెరాయ్ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ బస కోసం కేటాయించారు. గురుగ్రామ్ ఒబెరాయ్ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఉంటారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులుగా వస్తున్న ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ బృందం కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు.
భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా శుక్రవారం సాయంత్రం దిల్లీలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చలు జరపనున్నారు. ఇక రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక.. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు సహకరించాలని ఇప్పటికే ఢిల్లీ ప్రజలను మోదీ కోరిన విషయం తెలిసిందే. జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశాధినేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.
జీ20 సదస్సు జరిగే మూడ్రోజులు ఢిల్లీలో వాతావరణం మిశ్రమంగా ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. 9, 10 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి జల్లులు పడొచ్చని వివరించింది.