కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM ISTకేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PMSYM) అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్లు నిండాక.. నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందుతారు. అందుకోసం కార్మికులు 60 ఏళ్లు నిండే దాకా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కార్మికులు చేసిన కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా నిధులను అందిస్తుంది. ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు రూ.200 చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా అదనంగా రూ.200 జమ చేస్తుంది.
వ్యవసాయ, భవన నిర్మాణ, బీడీ, చేనేత, తోలు, ఆడియో విజువల్, వీధి వ్యాపారులు వంటి అసంఘటిత కార్మికులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయం రూ.15 వేల కన్నా తక్కువగా ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు. ఎన్‌పీఎస్, ఈఎస్‌ఐసీ స్కీమ్స్ లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉండకూడదు.
అర్హత ఉన్నవారు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్స్‌కు వెళ్లి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 3 లక్షలకుపైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు బ్యాంక్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డులు ఉండాలి. సీఎస్‌సీలో వాటిలో పాటు నామినీ వివరాలు సమర్పించాలి. సమాచారం వెరిఫై చేసిన తర్వాత, మీ అకౌంట్ ఓపెన్ చేసి, శ్రమ యోగి కార్డ్ అందిస్తారు. మరింత సమాచారం కోసం మాన్ ధన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
చందాదారుని విరాళం బ్యాంక్ ఖాతా నుంచి ఆటో పే విధానంలో జమ అవుతాయి. అయితే వయస్సు బట్టి పొదుపు చేయాల్సిన మొత్తం మారుతూ ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల వరకు నెలకు రూ.55 మాత్రమే జమ చేయాల్సి ఉంటంఉది. ఇక వయసు పెరిగే కొద్ది కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. 29 ఏళ్లలో ఈ పథకంలో చేరితే నెలకు రూ.100 పొదుపు చేయాలి. ఇక్కడి నుంచి ఏడాదికి పది రూపాయల కాంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంటుంది. అలా 35 ఏళ్లలో రూ.150, 40 ఏళ్లలో రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అలా 60 ఏళ్ల వరకు జమ చేస్తూనే ఉంటే ఆ తర్వాత ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు.