మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో నలుగురు సాధువులపై గ్రామస్థుల మూక దాడి చేసింది. దైవ దర్శనానికి వెళ్తున్న నలుగురు సాధువులను గ్రామస్థులు చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కారులో కర్ణాటకలోని బీజాపూర్ నుండి పంఢర్‌పూర్ ఆలయ పట్టణం వైపు వెళుతుండగా జాట్ తహసీల్‌లోని లవంగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం గ్రామంలోని ఓ దేవాలయం వద్ద సాధువులు బస చేశారు.
మంగళవారం ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేటప్పుడు.. ఓ పిల్లవాడిని రహదారి గురించి అడిగారని పోలీసు అధికారి తెలిపారు. దీంతో కొందరు స్థానికులు.. వారిని చూసి పిల్లలను అపహరించే క్రిమినల్ ముఠాల్లో భాగమేనని అనుమానించారు. ఆ తర్వాత గ్రామస్తులకు, సాధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదిగా కావడంతో సాధువులను స్థానికులు కర్రలతో కొట్టారు అని అధికారి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం సాధువులు ఉత్తరప్రదేశ్‌లోని 'అఖాడా' సభ్యులని గుర్తించారు.
సాధువులను వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారు నిజమైన సాధువులేనని తేల్చారు. తమను గ్రామస్థులు అపార్థం చేసుకున్నారని, అందుకే ఇలా జరిగిందని పోలీసులకు సాధువులు తెలిపారు. అలాగే తమకు అవగాహన లేకపోవడం వల్లే దాడి చేశామని గ్రామస్తులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయానికి సంబంధించి సాధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.