బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గుడిసె తగలబడడంతో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మైనర్ బాలికలు సజీవదహనమయ్యారని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామదయాలు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతులను నరేష్‌రామ్ బిడ్డలు సోని కుమారి (12), శివాని కుమారి (8), అమృత కుమారి (5), రీటా కుమారి (3) గా గుర్తించారు. బాలికలు నిద్రిస్తున్న సమయంలో వారి గుడిసెకు మంటలు వ్యాపించాయి. కొద్దిసేపటికే ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు గుడిసెలకు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఏడుగురికి కాలిన గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి (SKMCH) సిబ్బంది తెలిపింది. ఇక్కడే బాధితులు చికిత్స పొందుతున్నారు. సదర్ పోలీస్ స్టేషన్ SHO సత్యేంద్ర మిశ్రా మాట్లాడుతూ “ఇది రామదయాలు ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటన. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మైనర్ బాలికలు మృతి చెందారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపించాం. గాయపడిన వారిని SKMCH లో చేర్చారు." అని తెలిపారు.