నాకు పెన్షన్ ఇవ్వండి.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

By Medi Samrat
Published on : 30 Aug 2025 4:09 PM IST

నాకు పెన్షన్ ఇవ్వండి.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజస్థాన్ మాజీ శాసనసభ్యుడిగా తనకు పెన్షన్ రావాలని ఆయన కోరారు. దేశంలోని రెండో అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అప్లికేషన్‌ను రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ పరిశీలనకు స్వీకరించింది. ఈ విషయాన్ని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని ధ్రువీకరించారు. ధన్‌ఖడ్ నుంచి దరఖాస్తు అందిందని, నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.

రాజస్థాన్ నిబంధనల ప్రకారం, మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 35,000 పెన్షన్ లభిస్తుంది. అయితే, 70 ఏళ్లు దాటిన వారికి 20 శాతం, 80 ఏళ్లు దాటిన వారికి 30 శాతం అదనంగా ఇస్తారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న జగదీప్ ధన్‌ఖడ్‌కు 20 శాతం అదనపు ప్రయోజనం వర్తిస్తుంది. ఆయనకు నెలకు సుమారు రూ. 42,000 పెన్షన్ అందనుంది. జగదీప్ ధన్‌ఖడ్ 1993లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998 వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎమ్మెల్యేగా, లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, 2022లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

Next Story