ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.
By Medi Samrat
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ది బిజినెస్ లైన్ ప్రచురించిన నివేదిక ప్రకారం ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్.వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. వెంకటరమణన్ ఆర్బీఐ 18వ గవర్నర్ గా సేవలు అందించారు. ఆయన 1990 నుంచి 92 వరకు రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు. 1985 నుంచి 1989 వరకు కేంద్రంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.
ఈ వార్తలపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విచారం వ్యక్తం చేశారు. RBI మాజీ గవర్నర్ వెంకటరమణన్ మరణ వార్త వినడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన ఒక విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ప్రజా సేవకుడని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో దేశానికి అపారమైన సహకారం అందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు శక్తికాంత దాస్. భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణన్ నిర్మాణాత్మక ఆలోచనలతో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు.