కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అని అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన అధికారులు, ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం, ఓం ప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఓం ప్రకాశ్, బీహార్‌లోని చంపారన్ ప్రాంతానికి చెందినవారు. ఎమ్మెస్సీ (జియాలజీ) విద్యార్హత కలిగిన ఆయన, 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా పనిచేశారు, 2017లో పదవీ విరమణ చేశారు.