ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మాజీ చీఫ్ కె.కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం కస్తూరి రంగన్ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కస్తూరిరంగన్ 1990-1994 వరకు యూఆర్ఎసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అభివృద్ధిలో కస్తూరి రంగన్ కీలక పాత్ర పోషించారు. 2003-2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కస్తూరి రంగన్ కొనసాగారు.
అంతే కాకుండా బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ చైర్మన్‌గా వ్యవహరించారు. కాగా కస్తూరి రంగన్‌ను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషన్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.