వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. అంజు మాజీ కౌన్సిలర్.. ఆమె గతంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచారు. అంజు సెహ్వాగ్ గతంలో 2012 ఢిల్లీ MCD ఎన్నికల్లో దక్షిణపురి ఎక్స్‌టెన్షన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆమె ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. ఆప్ నేతలు ఆమెకు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పంజాబ్‌లో పర్యటిస్తూ ఉండడంతో అంజూ సెహ్వాగ్ ఆయన సమక్షంలో పార్టీలో చేరడం కుదరలేదు.
శుక్రవారం ఆప్ ఒక ట్వీట్ లో సెహ్వాగ్ సోదరి పార్టీలోకి చేరడంపై వివరణ ఇచ్చారు. "వీరేంద్ర సెహ్వాగ్ సోదరి, శ్రీమతి అంజు సెహ్వాగ్ AAPలో చేరారు. ఆమె ఢిల్లీకి చెందిన మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. CM కేజ్రీవాల్ చేసిన పని నుండి ప్రేరణ పొందిన ఆమె తన మద్దతుదారులతో కలిసి AAPలో చేరారు" అంటూ ఆప్ నుండి ట్వీట్ వెలువడింది.