సుప్రీంకోర్టు ఏ కేసును విచారించాలో మీరు నిర్ణ‌యిస్తారా.? : మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఓటమికి తానే కారణమంటూ శివసేన ఇటీవల చేసిన ఆరోపణలపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు.

By Medi Samrat  Published on  26 Nov 2024 5:14 PM IST
సుప్రీంకోర్టు ఏ కేసును విచారించాలో మీరు నిర్ణ‌యిస్తారా.? : మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఓటమికి తానే కారణమంటూ శివసేన ఇటీవల చేసిన ఆరోపణలపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చట్టం ప‌ట్ల భయాన్ని తొలగించారని.. తద్వారా రాజకీయ ఫిరాయింపులకు.. తదుపరి ఎన్నికలకు తెరదించారని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఫలితాల ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ చరిత్ర తనను క్షమించదని అన్నారు.

నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో MVA కూటమిలో భాగంగా శివసేన (UBT) పోటీ చేసిన 94 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. MVAలోని ఇతర మిత్రపక్షాలలో కాంగ్రెస్ 101 సీట్లలో 16 మాత్రమే గెలుచుకుంది. NCP (శరద్ పవార్) 86 సీట్లలో 10 మాత్రమే గెలుచుకుంది.

ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్.. శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం విమర్శలకు ప్రతిస్పందించారు. నా సమాధానం చాలా సులభం.. సుప్రీంకోర్టు ఏ కేసును విచారించాలో ఒక పార్టీ లేదా ఓ వ్యక్తి నిర్ణయించాలా? క్షమించండి.. కేసుల‌ ఎంపికపై నిర్ణ‌యం తీసుకునే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది అన్నారు. 20 ఏళ్లుగా సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. అన్నింటిపై నిర్ణ‌యాలు వెలుడ‌తాయ‌న్నారు.

2022 సంవత్సరంలో ఏకనాథ్ షిండే తిరుగుబాటు తరువాత అవిభక్త శివసేనలో చీలిక ఏర్పడింది, ఇది ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని అప్పటి పాలక MVA ప్రభుత్వం పతనానికి, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఏర్పడటానికి దారితీసింది. ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై థాకరే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. షిండే వర్గం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ప్రత్యర్థి గ్రూపుల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో స్పీకర్ షిండే వర్గాన్ని ‘అసలు’ శివసేనగా ప్రకటించారు.

Next Story