కరోనా మహమ్మారి భారతదేశంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే..! ఎంతో మంది ప్రముఖులు కరోనా కారణంగా మరణించారు.సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 68 సంవత్సరాల రంజిత్ సిన్హా కరోనాతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయిందని.. రంజిత్ సిన్హా శుక్రవారం వేకువజామున 4.30 గం.లకు ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1974 బీహార్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రంజిత్ సిన్హా, 2012 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు వరకు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకు ముందు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ డైరెక్టర్ జనరల్‌గా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) చీఫ్‌గా పలు కీలక హోదాల్లో పాట్నా, ఢిల్లీలలో విధులు నిర్వర్తించారు.
సీబీఐ డైరెక్టర్‌గా సిన్హా పదవీకాలంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన 2014లో ఒకదాని తరువాత మరొకటి వరుస వివాదంలో ఇరుక్కున్నారు. ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఝార్ఖండ్ బొగ్గు గనుల కుంభకోణం కేసులో నిందితులతో చేతులు కలిపి, సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.బొగ్గు కుంభకోణం విచారణను ప్రభావితం చేసేందుకు అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ప్రయత్నించారని 2016లో అప్పటి అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ చైర్మన్‌గా బొగ్గు కుంభకోణం కేసును అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా దర్యాప్తు చేశారు.