ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది.
By Knakam Karthik
ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
ఢిల్లీ: యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది. అధికారులు సాయంత్రానికి నీటి మట్టం 206.50 మీటర్ల వరకు చేరొచ్చని హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని తక్కువ ఎత్తు ప్రాంతాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. హర్యానాలోని హాథినికుంద్ బారేజ్ నుంచి నిరంతరం భారీగా నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలో ముప్పు మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో షాదరా జిల్లా కలెక్టర్ సాయంత్రం 5 గంటల నుంచి లోహా పూల్‌పై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే సమయంలో గురుగ్రామ్‌లో సోమవారం సాయంత్రం 3 నుంచి 7 గంటల మధ్యలోనే 100 మి.మీ. వర్షం కురవడంతో నగర జీవనం పూర్తిగా స్థంభించింది. హీరో హోండా చౌక్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సహా పలు కీలక ప్రాంతాలు మునిగిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లు 20 కి.మీ. మేర కొనసాగాయి. డ్రెయినేజీ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ లేన్ మూసివేయబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నీటి మట్టం నిలిచిపోవడంతో విద్యాసంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు ఆన్‌లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు జారీ చేశాయి. వాతావరణ శాఖ మంగళవారం ఢిల్లీలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 22 డిగ్రీలుగా ఉండొచ్చని తెలిపింది.