ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుండి కాలికట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు కనిపించడంతో తిరిగి అబుదాబి విమానాశ్రయంలో దిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. DGCA ప్రకారం.. విమానం టేకాఫ్ అయినప్పుడు 184 మంది ప్రయాణికులు ఉన్నారు.
'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ B737-800 విమానం టేకాఫ్ అయిన తరువాత 1000 అడుగుల ఎత్తులో ఉండగా నెం.1 ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన ఫైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారు. తిరిగి అబుదాబి ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.' అని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అంతకుముందు జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత తిరిగి ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2022లో దుబాయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించింది.
ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏవియేషన్ బాడీ తెలిపింది.