రూ.2 లంచం తీసుకున్న పోలీసులు.. 37 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు
వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఐదుగురు పోలీసులు. ఈ కేసులో 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా తీర్పు వెలువరించింది.
By అంజి Published on 4 Aug 2023 11:17 AM ISTరూ.2 లంచం తీసుకున్న పోలీసులు.. 37 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు
వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఐదుగురు పోలీసులు. ఈ కేసులో 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా తీర్పు వెలువరించింది. పోలీసులను నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 1986లో బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఐదుగురు పోలీసులు కలిసి వాహనదారుల నుంచి రూ.2లు లంచం తీసుకున్నారు. దీనిపై ఆ తర్వాత కేసు నమోదు అయ్యింది. ఇక అప్పటినుంచి కోర్టులో ఆ కేసు విచారణ సాగుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
1986 జూన్ 10న రాత్రి సమయంలో భాగల్‌పుర్ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద ఐదుగురు పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలను చెకింగ్ చేసే డ్యూటీ ఐదుగురు పోలీసులకు అప్పగించారు. వారు లఖో పోస్ట్‌లో ఉన్న చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి అజ్ఞాత సమాచారదారుడు పోలీసు సూపరింటెండెంట్ కి సమాచారం అందించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవటానికి ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం.. లఖో చెక్‌పోస్ట్ వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపిన ఎస్పీ.. ఆ వాహనం డ్రైవర్‌కు 2 రూపాయల నోటు ఇచ్చారు.
ఆ నోటుపై ఎస్పీ సిగ్నేచర్ చేసి మరీ ఇచ్చాడు. డ్రైవర్‌కు ఈ దారి వెంట వెళ్తున్న టైంలో పోలీసులు మిమ్మల్ని ఆపి లంచం అడిగితే ఈ నోటు ఇవ్వండి అని చెప్పారు. దానికి ఆ డ్రైవర్ ఒకే అని చెప్పి ముందుకు వెళ్లాడు. ఎస్పీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. ఆ వాహనం చెక్‌పోస్ట్ దగ్గరకు వెళ్లగానే అక్కడున్న పోలీసులు వాహనాన్ని ఆపి.. డ్రైవర్ నుంచి రూ.2 డిమాండ్ చేశారు. దీంతో ఎస్పీ సంతకం చేసిచ్చిన ఆ 2 రూపాయల నోటును డ్రైవర్ ఓ కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. ఆ డ్రైవర్ రిటర్న్‌లో ఎస్పీ దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు.
అంతే ప్లాన్ విజయవంతం కావడంతో ఎస్పీ వెంటనే చెక్‌పోస్ట్ దగ్గరకు వెళ్లి కానిస్టేబుల్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. అలా ఎస్పీకి ఆ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రామ్ రతన్ శర్మి,కైలాష్ శర్మ,జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే పోలీసులపై ముఫాసిల్ పోలీసు స్టేషన్ లోని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేయటం జరిగింది. ఈ కేసు అనేకసార్లు విచారణ జరిగి చివరకు భాగల్పుర్ లోని విజిలెన్స్ కోర్టుకు చేరగా తాజాగా వారంతా నిర్ధోషులు అని తీర్పునిచ్చింది. అలా 37ఏళ్లపాటు సాగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు ముగింపు పలికింది.