ఇడుక్కి: కేరళలో ఇటీవలి కాలంలో వన్య ప్రాణుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ వాళ్లు చేసిన తప్పు ఏమిటంటే చిరుతపులిని పట్టుకుని, వధించి, దాని మాంసంతో విందు చేసుకున్నారు. ఆరేళ్ల వయసున్న ఓ చిరుతపులిని చంపేశారు.
ఇడుక్కి జిల్లాకు చెందిన వినోద్ అనే వ్యక్తి తన పొలంలోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా పొలం చుట్టూ ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఆ ఉచ్చుల్లో ఓ చిరుతపులి చిక్కుకుంది. దాన్ని వినోద్, అతని స్నేహితులు చంపి, దాని మాంసంతో కూర వండుకుని తిన్నారు. ఆ పులి బరువు 50 కిలోల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత మాంసం తినడమే కాదు, దాని చర్మం, గోళ్లు, పళ్లను కూడా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మొదట పొరపాటున ఉచ్చు లోకి చిరుత పడిందని అనుకున్నారు. కానీ పక్కా ప్రణాళికతోనే వారు ఆ చిరుతపులిని బంధించినట్లు విచారణలో ఒప్పుకున్నారు. వారు గతంలోనూ అనేక వన్యప్రాణులను వధించినట్టు అధికారులు గుర్తించారు. వారి ఇళ్లల్లో ఇంకా వండని 10కేజీల మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చిరుతపులి చంపడం పెద్ద నేరం. గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. అలాగే భారీ ఫైన్ ను కూడా కట్టాల్సి ఉంటుంది.