ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆరేళ్లు నిండిన వారికి మాత్రమే ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
By అంజి Published on 23 Feb 2023 2:08 PM ISTఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకు మాత్రమే 1వ తరగతిలో ప్రవేశం కల్పించాలని చెప్పింది. దేశ వ్యాప్తంగా కొత్తగా అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఫస్ట్ క్లాస్‌లో ఆరేళ్లు నిండిన పిల్లలకు అడ్మిషన్లు కల్పించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర విద్యాశాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లెటర్ రాసింది. జాతీయ విద్యా విధానం 2020.. దేశానికి జాతీయ ప్రాధాన్యతగా 'పునాది దశలో' పిల్లల అభ్యాసాన్ని బలోపేతం చేయాలని సిఫార్సు చేసింది.
ప్రాథమిక దశలో మూడు నుండి ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఐదు సంవత్సరాల నేర్చుకునే అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇందులో మూడు సంవత్సరాల ప్రీ-స్కూల్ విద్య, ఆ తర్వాత రెండు సంవత్సరాల ప్రారంభ ప్రైమరీ గ్రేడ్, గ్రేడ్ టూ అంటే ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయని వివరించింది. ఈ విధానం ప్రీ-స్కూల్ నుండి గ్రేడ్ టూ వరకు పిల్లల అవాంతరాలు లేని అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందని విద్యాశాఖ వివరించింది.
అంగన్‌వాడీలు లేదా ప్రభుత్వ/ప్రభుత్వ-సహాయం పొందిన, ప్రైవేట్, ఎన్‌జీవో చే నడిచే ప్రీస్కూల్ సెంటర్‌లలో చదువుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల నాణ్యమైన విద్య అందుబాటులోకి తెవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయపడింది. ఈ లక్ష్యం నెరవేరడానికి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలరని తెలిపింది. ఇందుకు అనుగుణంగా అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు చేయాలంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి, అమలుచేయాలని సూచించింది. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ల డైట్ కాలేజీల ద్వారా అమల్లో పెట్టాలని చెప్పింది. ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో జిల్లా స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.