ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం

First Bird Flu death case reported in India.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోలేదు. మూడో వేవ్ త‌ప్ప‌ద‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 10:45 AM IST
ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోలేదు. మూడో వేవ్ త‌ప్ప‌ద‌న్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పుడు ఇది చాల‌దు అన్న‌ట్లు బ‌ర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) భ‌య‌పెడుతోంది. ప‌క్షుల‌కు సోకే బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతున్న‌ది. దీని కార‌ణంగా దేశంలో తొలి బ‌ర్డ్ ఫ్లూ మ‌ర‌ణం న‌మోదైంది. హరియాణాకు చెందిన‌ 11 ఏళ్ల బాలుడు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్‌తో బాధపడుతూ.. ఢిల్లిలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మించి మృతి చెందిన‌ట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్లు తెలిపారు. బాలుడు ప్రాణాలు కోల్పోవ‌డంతో అత‌డికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేష‌న్‌కు వెళ్లారు. ఏవైనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే రిపోర్ట్ చేయాల‌ని వారికి సూచించారు.

హర్యానాకు చెందిన సుశీల్‌ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. ఆ బాలుడికి మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్‌ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్‌ ట్రేస్‌ చేయడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది.

బ‌ర్డ్‌ఫ్లూ సాధార‌ణంగా ప‌క్షులు, కోళ్ల‌కు సోకుతుంది. బ‌ర్డ్ ఫ్లూ మ‌నిషికి సోక‌డం భార‌త్‌లో ఇదే తొలిసారి. ఈ నెల 15న బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ జాతి అయిన హెచ్‌5ఎన్‌6 స్ట్రెయిన్ చైనాలోని ఓ వ్య‌క్తికి సోకిన‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. భార‌త్‌లో ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభించడంతో వేలాది కోళ్లు, ప‌క్షులు మృతి చెందాయి. పంజాబ్‌లోనే 50 వేల ప‌క్షులు మృతి చెందాయి. ప‌లు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వల్ల ఎక్కువగా కాకులు, బాతులు మృతిచెందాయి.

Next Story