క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ సర్కార్ సంచలన నిర్ణయం.. పటాకులపై ఏడాది నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 2:23 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని కింద ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించబడింది. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. దీంతో క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలకు క్రాకర్లను కాల్చేలనుకున్నవారికి అడ్డుకట్ట వేసింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది.
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. ఈ ఉత్తర్వును ఉల్లంఘించడం చట్టవిరుద్ధం. అందువల్ల ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బాణసంచా తయారు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం, ఢిల్లీలో పటాకులు కాల్చడం శిక్షార్హమైన నేరం. దీని వల్ల దోషులకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వు అమలులో ఉండేలా చూడాలని, దానిని పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్, ఢిల్లీ ప్రభుత్వ రెవెన్యూ శాఖను ప్రిన్సిపల్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ ఆదేశించారు.
అక్టోబర్ నుంచి జనవరి మధ్య శీతాకాలంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. పండుగల సమయంలో కాలుష్యాన్ని పెంచడంలో పటాకులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పటాకులు కాల్చడం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 2020 నుంచి ఢిల్లీలో పండుగల సందర్భంగా పటాకులు కాల్చడంపై పూర్తి నిషేధం విధిస్తుంది.
ఈ ఏడాది కూడా అక్టోబర్ 14న ఉత్తర్వులు జారీ చేసి జనవరి 1 వరకు పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. అయితే అమ్మకందారులు ముందుగానే పటాకులను స్టాక్ చేస్తారు. ఈ కారణంగా స్వల్పకాలిక పరిమితులు ఎక్కువ ప్రయోజనాన్ని అందించవు. అందువల్ల ఏడాది పొడవునా నిషేధించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది బాణసంచా నిషేధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని గత నవంబర్ 4న సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ రాజధానిలో ఏడాది పాటు బాణసంచా నిషేధానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఉన్నతాధికారి ఉత్తర్వుల్లో కోర్టుకు తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.