రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. అయితే, లోకో పైలట్ అప్రమత్తత మరియు సకాలంలో చర్య తీసుకోవడం వల్ల, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పైలట్ రైలును నిలిపివేసి కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇంజిన్ నుండి పొగలు వస్తున్నట్లు గమనించిన వెంటనే, ప్రయాణికులు లోకో పైలట్‌కు సమాచారం అందించగా, అతను వెంటనే రైలును ఆపాడు. అతని సత్వర స్పందన వల్ల ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే యంత్రాంగం, మరిన్ని సంఘటనలు జరగకుండా నిరోధించడానికి సమీపంలోని రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేసిందని అధికారులు తెలిపారు.