ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలోని మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా ఆ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు, 15 పైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవ్వరూ మృతి చెందకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఎకె జైస్వాల్ మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులో ఉంది. మంటలను ఆర్పడానికి రోబోలను కూడా ఉపయోగించాం. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 15 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసినట్లు చెప్పారు.