దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తుల నివాస భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. దాని తర్వాత కనీసం ఐదుగురు వ్యక్తులు ఊపిరాడక ఆసుపత్రి పాలైనట్లు ఒక అధికారి తెలిపారు. సబర్బన్ కండివాలిలోని జనకళ్యాణ్ నగర్‌లోని మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలోని ఎలక్ట్రిక్ మీటర్ గదిలో ఉదయం 9 గంటలకు మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే భవనంలో పొగలు వ్యాపించాయి.వెంటనే పొగ మొత్తం భవనం చుట్టుముట్టింది.
దీని కారణంగా కొంతమంది నివాసితులు భవనం లోపల, దాని టెర్రస్‌పై చిక్కుకున్నారని అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు వాహనాలతో, పోలీసులు, అంబులెన్స్‌తో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం నుంచి దాదాపు 40 మందిని రక్షించారు. వారిలో ఐదుగురికి ఊపిరాడక పోవడంతో వారిని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురిని బీడీబీఏ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి, మరో ఇద్దరిని భాస్కర్ ఆస్పత్రికి పంపారు. ఉదయం 11 గంటల సమయంలో మంటలను ఆర్పివేశామని తెలిపారు.