భారీ అగ్ని ప్ర‌మాదం.. ఊపిరాడక‌, కళ్లల్లో మంటల‌తో ఇబ్బందులు ప‌డ్డ జ‌నం

దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఉన్న చెత్త కొండ‌లో ఆదివారం మంటలు చెలరేగాయి

By Medi Samrat  Published on  22 April 2024 7:30 AM IST
భారీ అగ్ని ప్ర‌మాదం.. ఊపిరాడక‌, కళ్లల్లో మంటల‌తో ఇబ్బందులు ప‌డ్డ జ‌నం

దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఉన్న చెత్త కొండ‌లో ఆదివారం మంటలు చెలరేగాయి. చెత్తకుప్పల నుంచి వెలువడుతున్న పొగ చుట్టుపక్కల కాలనీలకు వ్యాపించింది. దీంతో ఘాజీపూర్ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరాడక‌, కళ్లలో మంటల‌తో ఇబ్బందులు ప‌డ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 9 అగ్నిమాపక దళ వాహనాలను సంఘటనా స్థలానికి తరలించారు.

చెత్తాచెదారం ఉన్న కొండ‌ పైభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి వరకు మంటలను అదుపు చేయలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ.. చెత్త కొండ‌ల‌లో చెల‌రేగిన‌ మంటలు చాలా రోజుల పాటు ఉంటాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక చోట మంటలు ఆర్పితే మరో చోట మంటలు చెలరేగుతాయని పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5.22 గంటల ప్రాంతంలో ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ సైట్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటితో మంటలు తగ్గుముఖం పట్టేలా చేశాం.. కానీ పొగ పెరుగుతూ వచ్చింది. నీరు ఆరిపోగానే మళ్లీ మంటలు చెలరేగాయి. చెత్త వల్ల అక్కడ మిథేన్ గ్యాస్ ఏర్పడుతుందని.. దీంతో మళ్లీ మళ్లీ మంటలు చెలరేగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. వేడి కారణంగానే మంటలు చెలరేగాయో లేక మానవ తప్పిదాల వల్లనో తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.


Next Story