బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ వినాయక మండపంలో జేపీ నడ్డా హారతి కోసం వచ్చిన సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్ళింది. ఆయనకు ఏమీ అవ్వలేదని అధికారులు తెలిపారు.
ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాల్ దేవాలయం నమూనాలో రూపొందించిన గణపతి పండల్ పైభాగంలో ఈ మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న సమయంలో భారీ వర్షం కురవడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆరిపోయాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.