ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టారు. అసద్ బహిరంగ సభలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో అసదుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యూపీలోని ప్రయాగరాజ్‌లో నిర్వహించిన ర్యాలీలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించినందుకు అసదుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవలం వంద మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా పెద్దసంఖ్యలో ప్రజలను అనుమతించారని, ఇది కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘనేనని జిల్లా అధికారులు చెబుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రయాగరాజ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇక యూపీలో ఓవైసీ సభలకు సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవడం ఇది మూడవసారి. ఈ నెల ప్రారంభంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం, జాతీయ జెండాను అగౌరవపరచడం వంటి ఆరోపణలపై అసదుద్దీన్ పై కేసులను ఉత్తరప్రదేశ్ పోలీసులు బుక్ చేశారు. ఓ బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగం కారణంగా సెప్టెంబర్ 9 న బారాబంకి నగర పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 38 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. ఈసారి కూడా మజ్లిస్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.