గుజరాత్‌లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది. వాతావరణం, నది పరిస్థితులు పునరుద్ధరణ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుండటంతో, తప్పిపోయిన కనీసం ముగ్గురు వ్యక్తుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. కాగా మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 15కి పెరిగిందని అధికారులు గురువారం తెలిపారు.
ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే నాలుగు దశాబ్దాల నాటి వంతెనలోని ఒక భాగం బుధవారం ఉదయం వడోదరలోని పద్రా పట్టణానికి సమీపంలోని గంభీర గ్రామం సమీపంలో కూలిపోవడంతో అనేక వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. నదిలో పడి మూడు మీటర్ల బురదలో చిక్కుకున్న వాహనాలలో ఒక కారు, ఒక మినీ ట్రక్కులో ఉన్నవారి గురించి నిర్దిష్ట వివరాలు అందుబాటులో లేనందున, గుర్తించబడిన ముగ్గురు తప్పిపోయిన వ్యక్తులతో పాటు ఇతరులు కూడా ఉండవచ్చని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన తొమ్మిది మందిలో ఐదుగురు వడోదరలోని ఎస్‌ఎస్‌జీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని..గాయపడిన వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని ఎస్పీ రోహన్ ఆనంద్ తెలిపారు.