ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఉదయం చింతగుఫా, కిస్టారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోటలో ఉన్న ఛోటేకెడ్వాల్ గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. డివిజన్ కమిటీ సభ్యుడు, మావోయిస్టుల కిస్టారం ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ రాజు, కీలక మావోయిస్టులు ఛోటేకెడ్వాల్, బడేకెడ్వాల్, సింఘన్‌మడ్గు గ్రామాలలో 30-35 మంది కార్యకర్తలతో కలిసి ఉన్నారనే సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించారు. నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ గంట పాటు జరిగిన కాల్పుల్లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా జరుగుతోందని అధికారి తెలిపారు.