ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించబడ్డారు. జిల్లాలోని బెగ్‌రాజ్‌పూర్ గ్రామానికి చెందిన రైతులు తమ ఉత్పత్తులను సమీప సంతల్లో అమ్ముకుని సొంతూరుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో గర్రా నదిపై నుంచి వెళ్తుండగా ట్రాక్టర్ టైర్ ఒకటి ఊడిపోయింది. ఈ క్రమంలోనే అదుపుత్పిన ట్రాక్టర్ బ్రిడ్జిపైనుంచి నదిలోపడిపోయింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలి రెండు విడిపోయాయి.
హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) అవినాష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారని, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతుడిని ముఖేష్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 14 మందిని కాపాడామని చెప్పారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 24 మంది ఉన్నారని వెల్లడించారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామన్నారు. ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీని నదిలోనుంచి వెలికితీశామని చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), పిఎసి (ప్రోవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ) వరద యూనిట్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి.