ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం నాడు రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. అమరావతి రెవెన్యూ డివిజన్‌లో అత్యధికంగా 951 మంది మరణించారని కాంగ్రెస్ శాసనసభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిందని మంత్రి తెలిపారు.
నివేదిక ప్రకారం అమరావతి రెవెన్యూ డివిజన్‌లో 951 మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్‌లో 877 మంది, నాగ్‌పూర్ డివిజన్‌లో 257 మంది, నాసిక్ డివిజన్‌లో 254 మంది, పూణే డివిజన్‌లో 27 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుందని తెలిపారు.