సింహానికి ఎదురెళ్లాడు..ఆవుని రక్షించాడు..వీడియో వైరల్

సింహానికే ఎదురెళ్లాడు రైతు. చివరకు ఆవుని ప్రాణాలతో కాపాడుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 10:42 AM IST
Farmer, Save ox, Lion, Attack, Gujarat, viral Video,

సింహానికి ఎదురెళ్లాడు..ఆవుని రక్షించాడు..వీడియో వైరల్

చాలా మంది ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులను ఇష్టంగా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగానే భావిస్తారు. వాటికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతారు. రైతులు కూడా ఇంతే. తమ పాడిపశువులను జాగ్రత్తగా చూసుకుంటారు. వ్యవసాయ పనులు పశువులపైనే ఆధారపడి చేస్తారు కాబట్టి వాటిని ఎంతో గౌరవిస్తారు. పశువులకు ఏదైన సమస్య వస్తే ఎదురిస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ ఆవును సింహం వేటాడి పట్టుకుంది. మెడను నోటితో కరిచి వదల్లేదు. అది గమనించిన రైతు ఆవును వదిలేయలేదు. సింహానికే ఎదురెళ్లాడు. చివరకు ఆవుని ప్రాణాలతో కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా అలీదార్‌ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. కేవోడ్ కార్పొరేటన్‌ వివేక్‌ కొటాడియా అనే ట్విట్టర్‌ అకౌంట్లో వీడియోను పోస్టు చేశారు. వీడియోలో చూస్తే రోడ్డుపై వెళ్తున్న ఆవుని సింహం నోటితో పట్టుకుని ఉంది. అస్సలు విడిచిపెట్టడం లేదు. ఆవు తప్పించుకునే అవకాశం లేకుండా మెడను నోటితో పట్టుకుని ఉంది సింహం. ఆవు అరుపులు విన్న రైతు దగ్గరకు వచ్చాడు. సింహాన్ని చూశాడు. సింహంతో డేంజర్‌ అని తెలిసినా.. ఆవుని అలా వదిలేయాలనుకోలేదు. ఎలాగైనా ఆవుని కాపాడాలన్న లక్ష్యంతో.. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆవు సింహం నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు పక్కకు జరుగుతోంది. దాంతో రైతు రోడ్డు పక్కనే ఉన్న రాయిని తీసుకుని సింహం వైపు వస్తాడు. అతడు దాడి చేస్తాడేమో అని సింహం భయపడి ఆవుని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో అంతా కారులో ఉండి కొందరు రికార్డు చేశారు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదురు రైతును మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story