తమ తల్లిదండ్రులు టీవీ, సినిమాలు చూడనివ్వడం లేదని, కొట్టారని ఆరోపిస్తూ తమ తల్లిదండ్రులపై తోబుట్టువులు నమోదు చేసిన ట్రయల్ కోర్టు కేసు విచారణకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విరామం ఇచ్చింది. 2021లో ఒక సోదరుడు-సోదరి ద్వయం, 21 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు.. వారి తల్లిదండ్రులపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్‌లను చూడనివ్వడం లేదని, టీవీ చూపెట్టడం లేదని ఆరోపించారు. అక్కా తమ్ముడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జిల్లా కోర్టులో చలాన్ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లో పిటిషన్ వేశారు.
"2021 అక్టోబర్‌లో ఇండోర్‌లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 21 ఏళ్ల అమ్మాయి, ఆమె ఎనిమిదేళ్ల సోదరుడు వారి తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు" అని తల్లిదండ్రుల తరపు న్యాయవాది ధర్మేంద్ర చౌదరి చెప్పారు. ఇలాంటి సమస్యలను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని, చట్టపరమైన చర్యలకు వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆయన ఉద్ఘాటించారు. "ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితుడు, పిల్లల తండ్రి, అజయ్ చౌహాన్, ఈ కేసులో సెక్షన్ 482 CrPC కింద MP హైకోర్టులోని ఇండోర్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. జూలై 25 న ఈ విషయంపై విచారణ సందర్భంగా.. ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై హైకోర్టు స్టే విధించింది, ”అని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తన నివేదికలో పేర్కొంది.