'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశాలు ఇప్పిస్తామంటూ దేశవ్యాప్తంగా 1,700 మందికి పైగా మోసం చేసిన నకిలీ కాల్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాలోని ఇద్దరు సభ్యులను ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాత్, ఓం ప్రకాష్ అనే నిందితుల వద్ద నుంచి రూ.64,000 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణం వెనుక సూత్రధారి అయిన ప్రభాత్ ఢిల్లీలోని రోహిణిలో నకిలీ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను కల్పిస్తామని పలువురిని మభ్యపెడుతున్నాడు.
ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఎన్‌ఐటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఇన్‌స్పెక్టర్ బసంత్ చౌహాన్ నేతృత్వంలోని బృందం ఎట్టకేలకు వీరిద్దరిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశలు' అంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటనలు పెట్టేవారు.. ఆ ప్రకటనలు చూసి ఎవరైనా తమను సంప్రదిస్తే.. ఇంట్లో కూర్చొని నెలనెలా వేల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తామని ప్రలోభపెట్టి, వెంటనే డబ్బులు దండుకునేవారు. బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, ఈసీఎస్ ఛార్జ్, జీఎస్టీ, కొరియర్ ఛార్జ్, ఇన్సూరెన్స్ మొదలైన వాటి పేరుతో డబ్బులు లాగారని ఫరీదాబాద్ పోలీసు ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు.
నిందితులు దేశవ్యాప్తంగా 1,784 సైబర్ మోసాలకు పాల్పడ్డారని, ఇందులో 59 హర్యానాలో ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ముఠాతో సంబంధం ఉన్న ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.