ఫేస్‌బుక్ సాంకేతికత యువకుడి ప్రాణాన్ని కాపాడింది
Facebook alert saves life of Uttar Pradesh NEET aspirant contemplating ending his life. ఫేస్‌బుక్ సాంకేతికత యువకుడి
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2022 8:08 AM ISTప్రస్తుతం సోషల్ మీడియా వల్ల సమయం వృధాగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అదే సోషల్ మీడియా యూపీ రాజధాని లక్నోలో నీట్ అభ్యర్థి ప్రాణాలు కాపాడింది. ఓ వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు పేస్‌బుక్ నుంచి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఓ సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సకాలంలో ఆ వ్యక్తి ఇంటికి చేరుకుని అతడి ప్రయత్నాన్ని విరమింపజేశారు. అతడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అదనపు సీపీ (పశ్చిమ) చిరంజీవ్ నాథ్ సిన్హా తెలిపిన వివరాల మేరకు.. "నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న ఆవేదనతో లఖ్‌నవూకు చెందిన 29 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలని బావించాడు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. రియల్ టైం సాంకేతిక సాయంతో ఫేస్‌బుక్ ఈ విషయాన్ని గుర్తించింది. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేస్తూ మెసేజ్ పంపించింది. పోలీసులు వెంటనే అతడి ఇంటికి చేరుకుని అతన్ని సురక్షితంగా రక్షించారు. తాను తప్పు చేశానని, ఇకపై అలా చేయనని చెప్పేలా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు." అని తెలిపారు.
లక్నో పోలీసులు, ఫేస్‌బుక్ కు మధ్య గతంలో ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏంటంటే.. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశ్యంతో ఎవరైనా పోస్ట్ చేస్తే వెంటనే ఫేస్‌బుక్.. అలర్ట్ మెసేజ్‌ను సంబంధిత పోలీసులకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఒప్పందం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.