Video : 'ఆలయంపై గ్రెనేడ్ దాడి'.. ఐఎస్ఐ హస్తం ఉంది : పోలీసు కమిషనర్

పంజాబ్ అమృత్‌సర్‌లోని ఖండ్వాలాలోని ఠాకూర్‌ద్వారా ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి గ్రెనేడ్ దాడి జరిగింది.

By Medi Samrat  Published on  15 March 2025 4:19 PM IST
Video : ఆలయంపై గ్రెనేడ్ దాడి.. ఐఎస్ఐ హస్తం ఉంది : పోలీసు కమిషనర్

పంజాబ్ అమృత్‌సర్‌లోని ఖండ్వాలాలోని ఠాకూర్‌ద్వారా ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి గ్రెనేడ్ దాడి జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆలయంపై పేలుడు పదార్థాలను విసిరి పేలుడుకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆలయం వైపు అనుమానాస్పద వస్తువును విసిరివేయడం కనిపించింది. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఎవరికీ గాయాలు కాలేదని, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

ఈ పేలుడులో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని అమృత్‌సర్ కమిషనర్ జీపీఎస్ భుల్లర్ తెలిపారు. ఈ ఘటనపై తెల్లవారుజామున 2 గంటలకు మాకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని తెలిపారు. సీసీటీవీని పరిశీలించి సమీపంలోని వారితో మాట్లాడాం. విషయం ఏమిటంటే.. పంజాబ్‌లో అశాంతిని వ్యాప్తి చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మన యువతను తప్పుదోవ పట్టిస్తోందన్నారు.

సమస్యను త్వరగా పరిష్కరిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన భుల్లార్.. త్వ‌ర‌లోనే విషయాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవితాలను వృధా చేసుకోవద్దని యువతను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటాం. పోలీసు బృందాలు సిసిటివి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నాయి. ప్రాథమిక విచారణ ప్రకారం.. మోటారుసైకిల్ నడుపుతున్న యువకుడి చేతిలో జెండా ఉంది. వారిద్దరూ గ్రెనేడ్ విసిరే ముందు ఆలయం చుట్టుప‌క్క‌ల‌ కొంతసేపు నిలబడి ఉన్నారని పేర్కొన్నారు.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కొందరు దుండగులు ఆలయంపై గ్రెనేడ్‌ విసిరారని మంత్రి తెలిపారు. ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, ఒక రోజులో పట్టుకుంటారని పేర్కొన్నారు.

అమృత్‌సర్‌లోని ఠాకూర్‌ద్వారా ఆలయంపై దాడిని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఖండించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, అయితే పంజాబ్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వాటిని ఎదుర్కొనే అధికారం మన పోలీసులకు ఉంది. ఇలాంటి సంఘ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Next Story