ఇండియా కూట‌మికి 295 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎగ్జిట్ పోల్‌పై పెద్ద ప్రశ్న లేవనెత్తారు.

By Medi Samrat  Published on  3 Jun 2024 5:06 PM IST
ఇండియా కూట‌మికి 295 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎగ్జిట్ పోల్‌పై పెద్ద ప్రశ్న లేవనెత్తారు. ఎగ్జిట్ పోల్స్‌ను తమ పార్టీ అనుమానంగా చూస్తోందన్నారు. జూన్ 4న జరగనున్న ఫలితాల్లో ప్రతిపక్ష ఇండీ కూటమిదే విజయమని ఆయన మరోసారి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమికి ఈసారి 295 సీట్లు వస్తాయని తిరువనంతపురం నుంచి బ‌రిలో ఉన్న‌ శశిథరూర్ చెప్పారు.

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్‌పై.. ఇది కచ్చితమైన లెక్క కాదని.. అది సరిగ్గా ప్రతిబింబించడం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ఇండియాకు 295 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వాదనను థరూర్ ఉదహరించారు.

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఓటింగ్‌కు సంబంధించి లెక్కింపు మంగళవారం జరగనుంది. అయితే ఎన్నికల ముందు నిర్వహించిన అనేక సర్వేలు భారీ మెజారిటీతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపుపై తమ పార్టీ చాలా నమ్మకంగా ఉందని థరూర్ అన్నారు. తిరువనంతపురం నుంచి తన అభ్యర్థిత్వం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలుస్తానని చెప్పారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనుమానంగా చూస్తున్నామని అన్నారు. మేము దేశవ్యాప్తంగా ప్రచారాలను కూడా నిర్వహించాము. ప్రజల పల్స్ ఏమిటో కూడా మాకు తెలుసు. ఎగ్జిట్ పోల్‌లో ప్ర‌జ‌ల ప‌ల్స్‌ స్పష్టంగా కనిపిస్తుందని మేము అనుకోము. తిరువనంతపురం లోక్‌సభ స్థానంపై పోటీ త్రిముఖ పోటీ అని థరూర్ అభివర్ణించారు. విజయం సాధించడంపై నమ్మకంతో ఉన్నారని అన్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సీపీఐ అభ్యర్థి పన్నయన్‌ రవీంద్రన్‌ల నుంచి థరూర్ గట్టి సవాల్‌ ఎదుర్కొన్నారు.

Next Story