కేజ్రీవాల్‌కు మ‌ళ్లీ షాక్‌..!

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.

By Medi Samrat  Published on  21 Nov 2024 7:20 PM IST
కేజ్రీవాల్‌కు మ‌ళ్లీ షాక్‌..!

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన అక్రమాల కేసులో కేజ్రీవాల్ నిందితుడిగా ఉన్నారు.

ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ మనోజ్‌ కుమార్‌ ఓహ్రీ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి స్పందన కోరారు. దీంతో ఈ కేసు విచారణ డిసెంబర్ 20న జరగనుంది.

ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను నవంబర్ 20న కేజ్రీవాల్ హైకోర్టులో సవాలు చేశారు.

కేజ్రీవాల్‌ ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి అనుమతి లేకపోవడంతో ప్రత్యేక న్యాయమూర్తి ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్నందున ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టాలని కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. నేరం ఆరోపించిన సమయంలో ఆయ‌న‌ ప్రభుత్వ ప‌ద‌విలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

నవంబర్ 12న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఫిర్యాదుపై తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన మరో పిటిషన్‌పై హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి స్పందన కోరింది. క్రిమినల్ కేసులో ఈ దశలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Next Story