మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

Ex-Maharashtra home minister Anil Deshmukh arrested by ED.మ‌నీలాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 4:16 AM GMT
మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

మ‌నీలాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచార‌ణ నిమిత్తం ముంబ‌యి కార్యాల‌యంలో 12 గంట‌ల‌పైనే అనిల్ దేశ్‌ముఖ్‌ను విచారించిన అనంత‌రం ఈడీ అధికారులు సోమ‌వారం రాత్రి ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెల‌కు రూ.100కోట్లు వ‌సూలు చేయాల‌ని సస్పెండ్ అయిన పోలీసు అధికారి స‌చిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించిన‌ట్లు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌లు గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించాయి.

ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న మంత్రి ప‌దవి నుంచి త‌ప్పుకున్నారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. దీనిపై ఆయ‌న బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఇటీవ‌ల ఆయ‌న ఆస్తుల‌పైనా ఈడీ దాడి చేసి జ‌ప్తు చేసింది. దీంతో ఎట్ట‌కేల‌కు అనిల్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అయితే.. అధికారులు ప్ర‌శ్నించే స‌మ‌యంలో స‌హ‌కారం అందించ‌ని కార‌ణంగా అరెస్టు చేసిన‌ట్లు ఈడీ అధికారులు చెప్పారు. అరెస్టుకు ముందు అనిల్ దేశ్‌ముఖ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది.

కాగా.. తనపై వచ్చిన ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇటీవ‌ల ఓ వీడియో విడుద‌ల చేశారు. ఆ వీడియోలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అయితే.. అనిల్‌ దేశ్‌ముఖ్‌ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది.

Next Story