గుజరాత్ మాజీ సీఎం మాధవ్‌సిన్హా‌ సోలంకి కన్నుమూత

EX CM of Gujarat Madhavsinh Solanki passes away.గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సిన్హా‌ సోలంకి కన్నుమూత.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2021 5:50 AM GMT
EX CM of  Gujarat Madhavsinh Solanki

గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సిన్హా‌ సోలంకి క‌న్నుమూశారు. గాంధీన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో ఆయ‌న శ‌నివారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 93 సంవ‌త్స‌రాలు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న సోలంకి పార్టీలో ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన మృతి ప‌ట్ల‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహూల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా కూడా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సోలంకి తన పనులతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.


న‌రేంద్ర మోదీ కంటే ముందు అత్య‌ధిక కాలం గుజ‌రాత్ రాష్ట్రానికి సీఎంగా ప‌నిచేసిన వ్య‌క్తి సోలంకినే. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. గుజ‌రాత్ నుంచి రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న కుమారుడు భ‌ర‌త్ సిన్హా సోలంకి కూడా గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. మాధవ్‌సిన్హా‌ సోలంకి 1980 లో గుజరాత్‌లో కేహెచ్‌ఏఎం నినాదంతో అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందుకు కేహెచ్ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సోలంకి.. 1976లో కొంతకాలం సీఎంగా పనిచేశారు.

అనంత‌రం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) కూటమిని ఏర్పాటుచేసి 1980లో అధికారంలోకి వచ్చేలా చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆయ‌న గుజరాత్‌ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.
Next Story
Share it