బీజేపీ నాయకుడి వాహనంలో ఈవీఎం.. ఈసీ ఏమి చేసిందంటే..!

EVM On BJP Leader Vehicle. అసోంలో ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on  2 April 2021 4:44 PM IST
EVM On BJP Leader Vehicle

ఈవీఎం మెషీన్లతో మాయలు చేయొచ్చు అని కొందరు నాయకులు గతంలో కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా ఈవీఎం మెషీన్ ఒకటి భారతీయ జనతా పార్టీ నాయకుడి వాహనంలో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

అసోంలో ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది. అసోంలోని కరీంగంజ్ లోని రాతాబరీ నియోజకవర్గంలో జరిగింది. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య పేరిట ఉన్న ఆ కారును అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు.. ఆందోళనలకు దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అధికార బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఎన్నికల సంఘం ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు ఎన్నికల అధికారులపై వేటు వేసింది. ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వ కారు బ్రేక్ డౌన్ అవ్వడమే ఈ ఘటనకు కారణమని చెబుతూ ఉన్నారు. అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ అడిగి తీసుకున్నారట అధికారులు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నీలం బజార్ కు దగ్గర్లోనే వాహనం బ్రేక్ డౌన్ అయిందని.. ఆ వాహనంలోని ఎన్నికల సిబ్బంది వెంటనే సెక్టార్ ఆఫీసర్ అజయ్ సూత్రధార్ కు ఫోన్ చేశారు.. ఆయన వాహనం ఏర్పాటు చేసే లోపే అటుగా వస్తున్న వాహనాన్ని అధికారులు లిఫ్ట్ అడిగారని ఈసీ చెప్పింది.

ఆ వాహనం ఎవరిదో తెలియకుండానే అధికారులు ఆపారని, స్ట్రాంగ్ రూం వద్ద ప్రతిపక్ష కార్యకర్తలు ముట్టడించి దాడి చేసినప్పుడే ఆ కారు బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమిత పాల్ దిగా తెలిసిందని వెల్లడించింది. రాత్రి 10 గంటలకు కనైశిల్ కు చేరుకున్న తర్వాత.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం ట్రాఫిక్ లో ఆగింది. అప్పుడే 50 మంది దాకా గుంపుగా వచ్చి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఆ వాహనం బీజేపీ నేతదని ఆ గుంపుకు నాయకుడు చెప్పాడు. అప్పుడే అది బీజేపీ అభ్యర్థి కారని తెలిసిందని చెప్పింది. వారు హింసకు పాల్పడి దాడి చేయడంతో కరీంగంజ్ ఎస్పీకి గాయాలయ్యాయని తెలిపింది.

పోలింగ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించినందుకు పోలింగ్ అధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్‌లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయిందని అంటున్నారు. ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.



Next Story