గుడ్‌న్యూస్..పాస్‌బుక్ లైట్‌ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By - Knakam Karthik |
ఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్‌బుక్ లైట్‌ను తీసుకొచ్చింది. పాస్‌బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని తగ్గించింది. ఇకపై సింగిల్ లాగిన్‌తోనే ఈపీఎఫ్ఎకు సంబంధించిన అన్ని సేవలూ, పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్ సేవలకు సంబంధించిన సేవల కోసం ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌ను తెరవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, లావాదేవీలు, విత్ డ్రాలు వంటివి తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్ ఓపెన్ చేయాల్సిందే. ఇకపై ఆ అవసరం లేకుండా ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లోనే పాస్‌బుక్ లైట్ పేరిట కొత్త సేవలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వివరించారు.
ఇందులో పీఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్ డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. సమగ్ర వివరా లు, గ్రాఫిక్స్ తో కూడిన సమాచారం కావాలంటే పాస్‌బుక్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగవ్వడంతో పాటు సింగిల్ లాగిన్ తోనే ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పీఎఫ్ సేవల్లో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా అనెక్సర్-కే (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు వారి పీఎఫ్ ఖాతాలు వేరే పీఎఫ్ కార్యాలయానికి బదిలీ అవుతాయి. ఈ క్రమంలోనే పాత పీఎఫ్ కార్యాలయం నుంచి కొత్త కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ వెళు తుంది. ఇప్పటి వరకు ఈ సర్టిఫికెట్ పీఎఫ్ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. సభ్యులు అడిగినప్పుడే అందజేస్తున్నారు. ఇకపై మెంబర్ పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
దీనివల్ల పీఎఫ్ బదిలీ సమాచారం తెలుసుకోవడంతో పాటు పీఎఫ్ బ్యాలెన్స్, సర్వీసు వివరాలు సరిగా అప్డేట్ అయ్యాయో లేదో సభ్యులు చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు అందుకునే సందర్భంలో డిజిటల్ రికార్డుగానూ ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు, ప్రస్తుతం పీఎఫ్ ట్రాన్స్ఫర్లు, సెటిల్మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్ వంటి సేవలకు ఆర్పీఎఫ్సీ/ఆఫీసర్-ఇన్-ఛార్జి స్థాయి అధికారుల ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో కీలక మార్పు చేసింది. ఆ బాధ్యతలను అసిస్టెంట్ పీఫ్ కమిషనర్, సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు బదిలీ చేసింది. దీని వల్ల వేగంగా సెటిల్‌మెంట్లు పూర్తవుతాయని, ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గుతుందని మంత్రి మండవీయ పేర్కొన్నారు.