మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఖురుకేడ తాలూకా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న వారిలో కూడా కొందరికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. అందరినీ ఏరివేసేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
గడ్చిరోలి జిల్లాలోని ఖురుకేడ తాలుకా కొబ్రామెండ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారికీ ధీటుగా ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ కు గురైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.