రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ మీడియా సమావేశం.. ఎందుకంటే..
భారత ఎన్నికల సంఘం ఆగస్టు 17 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించనుంది
By Medi Samrat
భారత ఎన్నికల సంఘం ఆగస్టు 17 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించనుంది. మీడియా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ (మీడియా) తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి లేవనెత్తిన ప్రశ్నలకు ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్నికల కమిషన్ సమాధానం ఇస్తుందని తెలుస్తుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కాకుండా మరే ఇతర అంశంపైనా ఎన్నికల సంఘం అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించడం అసాధారణం. విలేఖరుల సమావేశానికి సంబంధించిన అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇది ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలకు సంబంధించినదని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం ఓటర్ల డేటాను తారుమారు చేసిందని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలలో ఓటు చోరీ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితాలో తప్పుగా చేర్చబడ్డారని లేదా తొలగించారని పేర్కొన్న వారి పేర్లను సంతకం చేసిన అఫిడవిట్‌తో పాటు సమర్పించాలని కమిషన్ రాహుల్‌ని కోరింది. ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వడంలో విఫలమైనందుకు ఎన్నికల సంఘం రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
అంతకుముందు ఆగస్టు 7న రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్‌పై ఓటు చోరీకి పాల్పడ్డారు. కర్నాటక సెంట్రల్‌లోని మహాదేవ్ పురా అసెంబ్లీ స్ధానంలో లక్ష మంది నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలో వందలాది మంది ఓటర్ల పేర్లు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రిగ్గింగ్ జరగకపోయి ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకునేదని.. దీని వల్ల కేవలం 9 సీట్లు మాత్రమే వచ్చాయని రాహుల్ అన్నారు. ఆ తర్వాత అఫిడవిట్‌తో పాటు ఫిర్యాదు చేయాలని రాహుల్ గాంధీని ఎన్నికల సంఘం కోరింది.