హర్యానా ఎన్నికల పోలింగ్ తేదీ మార్చిన ఈసీ.. కౌంటింగ్ డేట్ కూడా..
భారత ఎన్నికల సంఘం హర్యానా ఎన్నికల తేదీలను మార్చింది. ఎలక్షన్ కమిషన్ హర్యానాలో ఓటింగ్ రోజును అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 తేదీకి మార్చింది
By Medi Samrat Published on 31 Aug 2024 4:05 PM GMTభారత ఎన్నికల సంఘం హర్యానా ఎన్నికల తేదీలను మార్చింది. ఎలక్షన్ కమిషన్ హర్యానాలో ఓటింగ్ రోజును అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 తేదీకి మార్చింది. అదే విధంగా జమ్మూ-కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజును అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8కి మార్చారు. జమ్మూ కాశ్మీర్‌లో ఓటింగ్ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు. హర్యానాలో ఎన్నికల తేదీలను మార్చాలని బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్‌ను అభ్యర్థించాయి. దీంతో ఈసీ ఎన్నికల తేదీలను మార్చింది.
బిష్ణోయ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలు రెండింటినీ గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గురు జంభేశ్వర్ జ్ఞాపకార్థం అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనే పురాతన సంప్రదాయాన్ని బిష్ణోయ్ కమ్యూనిటీ కొనసాగిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఓటింగ్ తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ భారత ఎన్నికల కమిషన్‌కు, హర్యానా ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. సెప్టెంబర్ 28, 29 శని, ఆదివారాలు.. ఓటింగ్ కారణంగా అక్టోబర్ 1న సెలవు. గాంధీ జయంతి అక్టోబర్ 2న, అగ్రసేన్ జయంతి 3న. 30వ తేదీ సెలవు తీసుకుంటే ఆరు రోజుల సుదీర్ఘ వారాంతం. అటువంటి పరిస్థితిలో ప్రజలు సెలవుల కోసం రాష్ట్రం బయటకు వెళ్లే అవకాశం ఉంది.. ఇది ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేయవచ్చని బీజేపీ పేర్కొంది.
అక్టోబరు 2న అసోజ్ అమావాస్య కారణంగా బికనీర్‌లోని ముకం గ్రామంలో బిష్ణోయ్ కమ్యూనిటీకి సంబంధించిన మతపరమైన ఆచారం ఉందని కూడా బీజేపీ తన లేఖలో వాదించింది. దీని కోసం బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది ప్రజలు అక్టోబర్ 1వ తేదీన అక్కడికి చేరుకుంటారు. ఇది ఓటింగ్ శాతాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. తదుపరి తేదీని ప్రకటించేటప్పుడు ఓటింగ్ తేదీకి ఒక రోజు ముందు, ఓటింగ్ జరిగిన మరుసటి రోజు సెలవులు ఉండకూడదని బిజెపి కమిషన్‌కు తెలిపింది. అలా ప్టాన్ చేస్తే ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.
గత వారం ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించడం గమనార్హం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అక్టోబర్ 1న ఓటింగ్ నిర్వహించి, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా.. ఇప్పుడు అందులో మార్పులు వచ్చాయి.