అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్‌కు ఈసీ డెడ్‌లైన్
కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్‌కు ఈసీ డెడ్‌లైన్
ఢిల్లీ: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలతో అఫిడవిట్ సమర్పించాలా లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలా అన్న రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఏడు రోజులలోపు చేయాలని సూచించింది. అఫిడవిట్ ఇవ్వాలి లేక క్షమాపణ చెప్పాలి. మూడో మార్గం లేదు. రాహుల్ గాంధీ ఏడు రోజులలోపు అఫిడవిట్ సమర్పించకపోతే ఆయన ఆరోపణలు తప్పని అర్థం అవుతుంది” అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
అయితే ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. ఓటు చోరీ పేరుతో కొందరు అనవసర అనుమానాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటరు జాబితాను బూత్ లెవల్‌లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందన్నారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అయితే ఈ గడువు ఇవ్వడానికి కొద్ది గంటల ముందే, బీహార్‌లోని ససారం ప్రాంతంలో “వోటర్ అధికార్ యాత్ర” ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శించారు. “నేను వోట్ చోరీపై ప్రెస్ మీట్ పెట్టగానే అఫిడవిట్ ఇవ్వమని ఎన్నికల కమిషన్ అడిగింది. కానీ బీజేపీ నాయకులు కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వారిని ఎలాంటి అఫిడవిట్ అడగలేదు. కమిషన్ చెబుతుంది—‘నీ డేటా సరిగ్గా ఉందని అఫిడవిట్ ఇవ్వు’ అని. కానీ ఆ డేటా ఎన్నికల కమిషన్‌కే చెందినది. మరి నాకు ఎందుకు అఫిడవిట్ అడుగుతున్నారు?” అని రాహుల్ ప్రశ్నించారు.