వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి చేరుకున్న ఏక్‌నాథ్ షిండే
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యంపై స్పందించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 9:04 AM GMTగత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యంపై స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఏక్నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వెలువడ్డాయి. గ్రామం నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా.. షిండే ముంబైకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన థానేలో ఉన్నారు.
రొటీన్ చెకప్ కోసం ఏకనాథ్ షిండే మంగళవారం థానేలోని జూపిటర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ నేను బాగానే ఉన్నాను అని ఆయన చెప్పారు. చింతించవద్దు.. ఇది రొటీన్ చెకప్ అని శివసేన నేత ఉదయ్ సమంత్ అన్నారు. చెకప్ తర్వాత షిండే ముంబైలోని తన అధికారిక నివాసం వర్షకు తిరిగి రానున్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్, బలహీనత, జ్వరం ఉన్నట్లు తెలియజేసారు. రక్త పరీక్ష చేయించుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారుగా భావిస్తున్నారు. కానీ మహాయుతి కూటమి ఇంకా పేరు ప్రకటించలేదు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం బుధవారం జరగనుంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ ముంబైలోని వేదికను సోమవారం ఆయన సందర్శించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలు పంపినట్లు బవాన్‌కులే తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, గవర్నర్లు, భాజపా ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.