Karnataka Assembly Elections 2023 : ఎన్నికలకు ముందు బీజేపీకి ఎనిమిది షాక్‌లు..!
Eight shocks for BJP before the elections. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్నిపార్టీలు దాదాపు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.
By Medi Samrat Published on 17 April 2023 2:25 PM ISTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్నిపార్టీలు దాదాపు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. జాబితా విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ టిక్కెట్లు రాకపోవడంతో పలువురు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. వీరిలో 8 మంది పెద్ద నేతలు పార్టీని వీడారు. టిక్కెట్ రాకపోవడంతో పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్, జేడీఎస్ లలో చేరారు. వీరిలో బీజేపీకి చెందిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది కూడా ఉన్నారు. బీజేపీని వీడిన శెట్టర్ ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీజేపీని వీడడం ఆ పార్టీకి భారీ నష్టంగా భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లు జాబితా ప్రకటించిన తర్వాత మొత్తం 8 మంది బీజేపీ నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది తో పాటు మాజీ ఎమ్మెల్యే డీపీ నారీబోలు, మంత్రి ఎస్ అంగార, బీఎస్ యడ్యూరప్ప సన్నిహిత వైద్యుడు విశ్వనాథ్‌తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి, సిట్టింగ్ ఎమ్మెల్యే రామప్ప లమాని, సిట్టింగ్ ఎమ్మెల్యే గూళి హతి శేఖర్, సిట్టింగ్ ఎమ్మెల్సీ శంకర్ ఉన్నారు.
జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది తప్పుకోవడం బీజేపీకి పెద్ద దెబ్బ. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీకి పెద్ద నష్టం తప్పదని భావిస్తున్నారు. షెట్టర్ హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుండి టిక్కెట్ కోసం ప్రయత్నించగా.. బీజేపీ ఇవ్వడానికి నిరాకరించింది. లింగాయత్ వర్గానికి చెందిన శెట్టర్ కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో 18 శాతం ఓటర్లను కలిగి ఉంది. బీజేపీకి ఆ వర్గం మద్దతు ఉంటుందని భావిస్తుంది. అయితే షెట్టర్ బీజేపీని వీడడంతో ఆయన ఒక్కడే 20 నుంచి 25 సీట్లపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు.