మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రశ్నించే ముందు అరవింద్ కేజ్రీవాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదేశిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ తనను అరెస్టు చేస్తుందని అన్నారు.
"బీజేపీ ఏజెన్సీకి సూచించినట్లయితే సీబీఐ నన్ను అరెస్టు చేస్తుంది" అని ఆయన అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐతో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ప్రశ్నించింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎవరెవరితో మాట్లాడారో లేదా కలిశారో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఇప్పటివరకు ఏ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు.