న‌దిలో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి.. ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి

Eight Dead as bus falls into River in Jharkhand.ప్ర‌యాణీకుల‌తో వెలుతున్న బ‌స్సు అదుపు త‌ప్పి వంతెన పై నుంచి న‌దిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2022 2:37 AM GMT
న‌దిలో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి.. ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి

జార్ఖండ్ రాష్ట్రంలోని హ‌జారీబాగ్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణీకుల‌తో వెలుతున్న బ‌స్సు అదుపు త‌ప్పి వంతెన పై నుంచి న‌దిలో ప‌డి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మ‌ర‌ణించారు. 12 మంది గాయ‌ప‌డ్డారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. గిరిదిహ్ జిల్లా నుండి 50 మంది ప్ర‌యాణీకుల‌తో బ‌స్సు రాంచీ వెలుతోంది. తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే న‌ది వంతెన పై వెలుతుండ‌గా అదుపు త‌ప్పి కింద ప‌డిపోయింది. రెయిలింగ్‌ విరిగిపోయిన ప్రదేశంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ మనోజ్ రతన్ చోతే తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఇద్దురు మరణించారు. హజారీబాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌రో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది.

క్ష‌త‌గాత్రుల్లో మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు త‌ర‌లించారు. కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. బ‌స్సు నీళ్లు లేని చోట ప‌డింద‌ని, న‌ది మ‌ధ్య‌లో ప‌డి ఉంటే ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండేద‌ని అధికారులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంత్రిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని, ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

"తాటిజారియాలో వంతెనపై నుండి బస్సు పడిపోవడంతో ప్రయాణీకులు మరణించడం నాకు చాలా బాధ కలిగించింది. దేవుడు మరణించిన ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.

జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా కూడా ట్వీట్ చేస్తూ "గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సివిల్ సర్జన్ హజారీబాగ్‌ను ఆదేశించాను" అని అన్నారు.

Next Story